మహిళలు అత్యంత సంతోషంగా జరుపుకునే పండగలలో ఒకటి అట్ల తద్ది. ఈ పండుగ రోజున గౌరీ పూజ నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తామని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అసలు వాయినం ఎందుకు ఇస్తారు? వాయినం ఇచ్చే విధానం ఏంటో తెలుసుకుందాం. అట్లతద్ది రోజున 11 మంది ముత్తైదువులను మనం పిలుస్తుంటాం. వారిలో ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున.. గౌరీ దేవికి నైవేద్యంగా సమర్పించిన కుడుములతో కలిపి తాంబూలంతో కూడిన వాయినాన్ని ఇస్తారు.
అయితే ముత్తైదువులు అందుకున్న వాయనాన్ని తీసుకున్న మహిళ లేదంటే ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు చాస్తారు. వాయినం ఇచ్చే మహిళలు.. ఆ కొంగులో వాయినాన్ని పెట్టి ఇస్తినమ్మ వాయనం అని సమర్పించాలి. తీసుకునేవారు.. పుచ్చుకుంటినమ్మ వాయనం అని అందుకోవాలి. అసలు అట్లను వాయినంగా ఎందుకు ఇస్తారంటే నవగ్రహాలలో కుజుడికి మినుములంటే చాలా ఇష్టమట. కాబ్టటి ఆయనకు మినప అట్లను నైవేద్యంగా సమర్పిస్తే కుజ దోషం తొలగిపోతుందని నమ్మకం.