శ్రీరామనవమి ఎప్పుడు? పూజా విధానమేంటి?

లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరామచంద్రుడు. విష్ణుమూర్తి.. మానవ రూపంలో జన్మించి మానవులందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఏకపత్నీ వ్రతుడైన రాముడంటే ఒక నమ్మకం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మ దినోత్సవాన్ని ఆ సేతు హిమాచలం శ్రీరామనవమిగా ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర మాసం తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగతో పాటు ఆ రోజున సీతారాముల కల్యాణం నిర్వహించుకోవడం ఆనవాయితి. మరి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు రానుందో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఈ ఏడాది ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి శ్రీరామనవమిని ఏప్రిల్ 6న యావత్ భారతదేశం జరుపుకోనుంది. భారతదేశంతటా శ్రీరామనవమినాడు పెద్ద ఎత్తున సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరాముని ఆశీస్సులు పొందేందుకు ఇది ప్రత్యేకమైన రోజు. శ్రీరాముడిని పూజించిన వారికి జీవితంలో కష్టాలు, ఎలాంటి సమస్యలూ ఉండవని చెబుతారు.

శ్రీ రామ నవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. తరువాత ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి, దానిపై రాముడి చిత్రపటాన్ని పెట్టి గంగా జలం, పంచామృతం, పువ్వులు సమర్పించాలి. రామయ్యకు నైవేద్యం వడపప్పు, పానకం, చలిమిడి పెట్టాలి. ఆ తరువాత పూజ చేసిన సీతారాములకు హారతి ఇవ్వాలి.

Share this post with your friends