
హిందూమతంలో ప్రతి ఒక్క రోజుకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే దసరా కంటే ముందుగానే.. నవరాత్రులు కొనసాగుతున్న తరుణంలోనే స్కంద షష్టి పండుగ రానుంది. ఈ పండుగను ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి రోజున జరుపుకుంటాం. శుక్ల పక్షం షష్ఠి తిథి అనేది శివపార్వతుల తనయుడు కార్తికేయుడికి అంకింతం చేయబడింది కాబట్టి మనం ప్రతి నెల ఈ రోజున కార్తికేయుడిని పూజించుకుంటూ ఉంటాం. ఈ రోజున కార్తికేయుడిని పూజిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.
మరి మనం అంత ప్రాధాన్యతనిచ్చే స్కంద షష్టి తిథి ఎప్పుడో తెలుసా? హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి అక్టోబర్ 8, మంగళవారం ఉదయం 11:17 గంటలకు ప్రారంభమై మరునాడు అంటే అక్టోబర్ 9 బుధవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ముగుస్తుంది. మనం ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఉపవాసం అక్టోబర్ 9 వ తేదీన మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది. ఆ రోజున చేపట్టిన ఉపవాసం మరుసటి రోజు అంటే 10వ తేదీన ముగుస్తుంది.
