శ్రీకృష్ణ జన్మాష్టమి.. దీనిని హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. పురాణ గ్రంధాల ప్రకారం శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు అష్టమి తిథి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం వలన ఫలితం చాలా బాగుంటుందట. మరి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది ఎప్పుడు అంటారా? పంచాంగం ప్రకారమైతే.. ఈ నెల 26వ తేదీనే జన్మాష్టమి. వేద క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్ట్ 25న సాయంత్రం 06.09 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే 26 ఆగస్టు 2024 సాయంత్రం 04.49 గంటలకు అష్టమి తిథి ముగుస్తుంది. కాబట్టి 26న జరుపుకుంటాం.
ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ రోజున జయంతి యోగం ఏర్పడనుంది. ఈ రోజున శ్రీకృష్ణుడి ఈ శుభ సమయంలో పూజ చేసిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం. జన్మాష్టమి రోజున ఉపవాసం పాటించేవారు.. 26న ప్రారంభించి 27న ఉదయం 6:36 గంటల వరకూ ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం పాటిస్తే వంద జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. మానవ జన్మ ఎత్తిన శ్రీకృష్ణుని పట్ల భక్తితో జీవిస్తారట. కృష్ణాష్టమి రోజున రోహిణి నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి ఉపవాసం చేసి శ్రీకృష్ణుడిని మరు జన్మ అనేది లేకుండా మోక్షం లభిస్తుంది.