
ప్రతి నెలా మాస శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాం. కృష్ణ పక్షంలోని చతుర్దశి రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ఈ రోజున ఉపవాసం ఉండి ఆది దంపతులైన శివపార్వతులను పూజించుకుంటే మనకు చాలా మంచి జరుగుతుందని నమ్మకం. పైగా వారి ఆశీర్వాదం లభిస్తుందట. ఈ ఏడాది ఆషాఢ మాస శివరాత్రి ఆగస్ట్ 2వ తేదీ 2024న వచ్చింది. ఈ రోజున అవివాహితులు శివపార్వతులను పూజిస్తే తప్పక వివాహం జరుగుతుందని నమ్మకం. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందట.
మాస శివరాత్రి నాడు చేసే వ్రతానికి కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత శుచిగా స్నానమాచరించి ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడికి గంగా జలంతో అభిషేకం చేయాలి. అనంతరం పచ్చి పాలతో అభిషేకించాలి. ఆ తరువాత సాధారణ నీటితో స్వామివారికి అభిషేకం చేయాలి. నీటిలో బిల్వపత్రాన్ని, గంథాన్ని కలిపి శివలింగానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం చేయాల్సి ఉంటుంది. పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకానంతరం శివలింగానికి బిల్వపత్రాలు, శమీ పత్రాలు, పండ్లు, పువ్వులు సమర్పించి శివ చాలీసా పఠించాలి.
