
హిందూమతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఇక రానున్నది పుత్రద ఏకాదశి. ఈ రోజున ఉండగలిగిన వారంతా ఉపవాసం ఉంటారు. ఇది ప్రతి ఏటా రెండు సార్లు వస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసం శుద్ధ పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి లేదా పవిత్రోపన ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి జరుగుతుందట. సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం.
ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన రోజు. కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయట. అసలు ఈ పుత్రద ఏకాదశి ఎప్పుడో ముందుగా తెలుసుకుందాం. పుత్రద ఏకాదశి తిథి ఈ ఏడాది ఆగస్ట్ 4న ఉదయం 11:41 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్ట్ 5వ తేదీన మధ్యాహ్నం 01:12 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పుత్రద ఏకాదశి ఉపవాసం ఆగస్టు 5, మంగళవారం నాడు పాటించడం జరుగుతుంది.
