ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? ఆ రోజున ఏం చేయాలి?

తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గుణ మాసం కాబట్టి ఈ ఏడాది చివరి అమావాస్య ఈ నెల 29న రానుంది. ప్రతి నెల కృష్ణ పక్ష చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది. ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య చివరిదే కాకుండా చాలా ప్రత్యేకమైనది. ఈ సారి ఈ అమావాస్యకు సూర్యగ్రహణం తోడవడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ గ్రహణం భారతీయులకు కనిపించదు కాబట్టి సూతకాలం అంటూ ఏమీ లేదు. ఈ అమావాస్యను పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ తిథికి పూర్వీకులే అధిపతులు కాబట్టి. అయితే సూర్యగ్రహణం కాబట్టి ఫాల్గుణ అమావాస్య రోజున చేసే మతపరమైన ఆచారాలను ఆపాలా? అంటే ఆపక్కర్లేదని పండితులు చెబుతున్నారు.

అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, తర్పణం ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం వంటివి హిందువులంతా చేస్తుంటారు. ఇలా చేయడం వలన పితృదోష నివారణ జరుగుతుందని నమ్మకం. పితృదేవతలంతా తమ ఆశీర్వాదాలను ఇస్తారని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో పాల్గుణ అమావాస్య తిథి రోజున తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక చర్యలు కూడా ప్రస్తావించబడ్డాయి. పాల్గుణ అమావాస్య రోజున ఉదయమే పవిత్ర నదిలో స్నానం చేసి.. పూర్వీకులకు తర్పణం వదలాలి. అనంతరం పిండ ప్రదానం చేయాలి. పూర్వీకుల పేరిట పేదలకు, ఆపన్నులకు ఆహారం అందించండి. మీ సామర్థ్యం మేరకు దక్షిణ ఇవ్వడం వల్ల పూర్వీకులు సంతోషించడమే కాకుండా జాతకంలోని పితృ దోషం కూడా తొలగిపోతుంది.

Share this post with your friends