శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగలు, వ్రతాలు, శుభకార్యాలు మొదలైపోతాయి. మొత్తానికి శ్రావణ మాసమంతా సందడి సందడిగా ఉంటుంది. హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగలలో నాగ పంచమి ముఖ్యమైనది. ఈ పండుగను హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతోనిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలోనే కాకుండా నేపాల్, దక్షిణాసియా దేశాల్లోనూ జరుపుకుంటారు. ఇక ఈ పండుగ రోజు నాగేంద్రుడిని పూజిస్తారన్న విషయం తెలిసిందే. శ్రావణ మాసంలో పంచమ తిథి నాడు నాగ పంచమిని జరుపుకుంటారు. ఇక ఇది ఎప్పుడు అంటారా?
ఈ సంవత్సరం శ్రావణ మాసంలో నాగ పంచమి ఈ నెల 9వ తేదీన రానుంది. ఇవాళ కానీ నాగేంద్రుడిని పూజిస్తే అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే ఎవరి జాతకంలో అయినా కాలసర్ప దోషం ఉంటే.. నాగ పంచమి రోజున నాగేంద్రుడిని పూజిస్తే ఆ దోషమంతా పోయి.. ప్రశాంతత చేకూరుతుందట. ఒకవేళ రాహు-కేతువుల వల్ల జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే కూడా నాగ పంచమి రోజున పాములను పూజించినా కూడా చెడు ప్రభావం తగ్గుతుందట. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య ఉంటే దానిని కాలసర్ప దోషంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ దోషం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజిస్తే ఇవన్నీ తొలగిపోతాయి.