
హిందువులు గాయత్రీదేవికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. గాయత్రీ దేవి.. లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, కాళికా దేవికి ప్రతీకగానూ భావిస్తారు. వేదాలకు అధి దేవతగా భావిస్తారు. అది మాత్రమే కాకుండా సకల శక్తులకూ ఆధారంగానూ.. నాలుగు వేదాల సారాంశంగానూ గాయత్రీ మంత్రాన్ని చూస్తారు. అందుకే గాయత్రీ మంత్రానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గాయత్రి దేవి జ్ఞానం,ఆధ్యాత్మిక వృద్ధికి చిహ్నం కాబట్టి గాయత్రీ జయంతి అనేది ముఖ్యమైన పండుగగా అంతా భావిస్తారు. ముఖ్యంగా గాయత్రీ జయంతి విద్యార్థులకు చాలా ప్రత్యేకం.
గాయత్రీ జయంతి నాడు గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని చీకటి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. వేద క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి అంటే నిర్జల ఏకాదశి రోజున గాయత్రీ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఏడాది గాయత్రి జయంతి ఎప్పుడు రానుంది? అంటే.. ఈ తిథి జూన్ 6 తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమై మర్నాడు జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మనం ఏ పండుగను అయినా జరుపుకుంటాం కాబట్టి గాయత్రీ జయంతి పండుగను సైతం జూన్ 6న జరుపుకుంటాం.
