హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ఈ మాసాల్లో కార్తీక, శ్రావణ మాసాలను అత్యంత పవిత్రమైన మాసాలని చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన మాసమే.. మాఘమాసం. మఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే మాసం కాబట్టి దీనిని మాఘ మాసమని చెబుతారు. మాఘ మాసానికి ఉన్న విశిష్టత కారణంగానే ఈ మాసంలో భారీగా వివాహాలు జరుగుతుంటాయి. ఏడాది మొత్తంలో వివాహాలు అధికంగా జరిగే మాఘ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. మాఘం అంటే అర్థమేంటో తెలుసుకుందాం. మఘం అంటే యజ్ఞం అని అర్ధం.
ఈ మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో తెలుసుకుందాం. జనవరి 30, గురువారం నుంచి పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం కానుంది. ఈ మాఘ మాసం సాధారణ వ్యక్తులకే కాదు.. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు, మునులు సైతం తాము నిర్వహించే యజ్ఞయాగాది క్రతువులకు మాఘ మాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. అంతేకాకుండా ఇది మాధవునికి ప్రీతికరమైన మాసం. సకల దేవీ దేవతలకు ప్రీతికరమైనదీ మాఘ మాసం. ఈ మాసంలో శివుడు, కేశవుడు, సరస్వతి, గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.