అజ ఏకాదశి రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు?

అజ ఏకాదశి రేపు రానుంది. ఈ రోజున మరో రెండు శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి కాబట్టి ఇది మరింత స్పెషల్ అని తెలుసుకున్నాం. ఇక అజ ఏకాదశి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. అజ ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానమాచరించి.. శుభ్రమైన బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేయాలి. ఆపై ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉండవచ్చు. ఆ తరువాత విష్ణుమూర్తితో పాటు తులసి మొక్కను సైతం పూజించాలి. ఆ తరువాత అజ ఏకాదశి కథను చదవండి. ఈ రోజున పేదవారికి దానం చేసినా చాలా మంచిదట. ఆహారం, బట్టలు వంటివేమైనా శక్తి మేరకు దానం చేయవచ్చు.

వీలైతే విష్ణు మూర్తిని కీర్తిస్తూ భజన చేసుకోండి. ఇక ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారమైన.. పండ్లు, కూరగాయలు, పాలు వంటివి తీసుకోవచ్చు. వీలైతే విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకోండి. అజ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మంచి జరుగుతుందని నమ్మకం. ఇక ఈ రోజున చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. శారీరక శ్రమ, వినోదం వంటి వాటికి దూరంగా ఉండాలి. కోపం, హింస వంటి జోలికి వెళ్లకూడదు. అలాగే మాంసాహారం, మద్యం వంటివి స్వీకరించకూడదు. ఇక ఈ రోజున రోజంతా ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండగలిగిన వారు ఉండొచ్చు. ఉండలేని వారు పూర్తిగా ఫ్రూట్స్‌ తీసుకోవచ్చు.

Share this post with your friends