శ్రావణ మంగళగౌరీ వ్రతం చేయడానికి ముందు ఏం చేయాలంటే..

తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఆచరించాలి. మరి అసలు శ్రావణ మంగళ గౌరి వ్రతం అంటే ఏంటి? ఎవరు ఆచరిస్తారు? ఎలా ఆచరించాలి? వంటి విషయాలను చూద్దాం. శ్రావణ మంగళ గౌరి వ్రతం అంటే.. ఆ సర్వమంగళ దేవి అయిన పార్వతీ దేవిని ప్రార్థిస్తూ చేసే వ్రతం. దీనిని కొత్తగా పెళ్లైన వారు చేస్తుంటారు. సుమంగళిగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి చెప్పాడని నారద పురాణం తెలియజేస్తోంది.

ఈ వ్రతం ఆచరించే వారు బ్రహ్మ ముహూర్తానే లేచి శుచిగా స్నానం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఆపై పూజ చేసుకోవాలి. ఈ వ్రతం చేయడానికి ముందుగా పసుపుతో గణపతి చేసి అనంతరం ఆవాహన చేసి షోడశోపచారాలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ‘గుడం’ అనగా బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజను ప్రారంభించాలి. తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసి.. ఐదు పూలు, ఐదు చోట్ల కట్టాలి. ఈ తోరములను పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేయాలి. తోరములను తయారు చేసుకున్న తరువాత మంగళ గౌరీ పూజ మొదలు పెట్టాలి.

Share this post with your friends