ఇల్లు సుఖశాంతులతో ఉండాలా? వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ గది ఏ దిక్కున ఉండాలి? ఎక్కడ పూజ చేయాలి? ఎక్కడ వంట చేయాలి? వంటి విషయాలతో పాటు ప్రతిదీ ముఖ్యమే. ఇక ఇంట్లో మనం పెట్టుకునే వస్తువులు, పెట్టుకోకూడని వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగపోతుంది. లేదంటే ఇబ్బంది తలెత్తుతుంది. ఇంట్లో ఆనందం నెలకొని ఉండాలంటే కొన్ని వస్తువులను మనం ఇంట్లో పెట్టాలట. ఆ వస్తువులు ఇంట్లో ఆనందం, డబ్బుకు కొదవ ఉండదని అంటారు. మరి ఆ వస్తువులేంటో తెలుసా?
శ్రీయంత్రం
లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే మన ఇంట్లో శ్రీ యంత్రం తప్పనిసరిగా ఉండాలంటారు. ఆచారాల ప్రకారం శ్రీ యంత్రాన్ని ఉంచి పూజించే ఇంట్లో, లక్ష్మి ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది.
స్వస్తిక్..
ప్రధాన ద్వారంపై తలుపై పైన మధ్యలో ఉండి స్వస్తిక్‌ను ఉంచాలి. దీనిని ఇంట్లో ఉంచితే ఇంట్లో సుఖ శాంతులకు లోటు ఉండదట.
తాబేలు..
లోహపు తాబేలు ఇంట్లో ఉండటం వాస్తుపరంగా చాలా మంచిదట. హిందూ మతంలో తాబేలును విష్ణుమూర్తి అవతారంగా భావిస్తూ ఉంటారు. ఇంటి ఉత్తర దిశలో ఇత్తడి లేదా బంగారు-వెండి తాబేలును ఉంచితే చాలు.. ఎలాంటి కష్టమూ మన దరి చేరదట.
గోమతీ చక్రం
శుభ సమయంలో లేదా శుక్రవారం నాడు 11 గోమతి చక్రాలను ఇంటికి తీసుకు వచ్చి లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి పూజించాలి. అనంతరం గోమతి చక్రాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే స్థలంలో పెడితే ధనం వృద్ధి చెందుతుందని నమ్మకం.
దక్షిణవర్తి శంఖం
శుక్రవారం నాడు దక్షిణవర్తి శంఖాన్ని ఇంట్లో ప్రతిష్టించి ప్రతిరోజూ పూజిస్తే.. లక్ష్మి దేవి అనుగ్రహం తప్పక మనపై ఉంటుంది.