
అమ్మవారు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి. ఆదిపరాశక్తిగా మనం దుర్గమ్మను కొలుచుకుంటాం. అయితే దుర్గమ్మను సౌభాగ్య సిద్ధి కోసం, దృష్టి దోష నివారణ కోసం కూడా పూజించుకుంటారు. వీటికోసం అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేయడమనేది ఒక ఆచారం. అయితే కేవలం ఆచారం మాత్రమే కాదు.. దీనివెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. అసలు ఆ శాస్త్రీయ కోణమేంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేయడం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక నేపథ్యంతో పాటు అంతరార్ధం కూడా ఉందని చెబుతారు.
పసుపు అనేది సౌభాగ్యానికి, శుభానికి చిహ్నంగా మనం చూస్తామన్న విషయం తెలిసిందే. ఇక దుర్గమ్మ విషయానికి వస్తే.. స్వయంగా అమ్మవారు ఏ ఆలయంలో చూసినా కూడా పసుపు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఆ తల్లిని మంగళ రూపిణి అంటారు. పసుపు కొమ్ములనేవి భూమి నుంచి ఉద్భవించాయి. ఇవి స్వచ్ఛమైన ప్రకృతి ప్రసాదాలని చెబుతారు. అమ్మవారిని కూడా మనం ప్రకృతి స్వరూపిణిగానే భావించి పూజించుకుంటాం. అందుకే అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ములతో మాల వేసి ఆరాధిస్తాం. అయితే పసుపు కొమ్ముల మాల అనేది అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం నాడు సమర్పిస్తే మరింత మంచిది.
