ఈ నెలలో శని ప్రదోష వ్రతం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకున్నాం కదా. ఈ సారి త్రయోదశి తిథి శనివారం రావడంతో శని ప్రదోష వ్రతాన్ని జరుపుకోనున్నాం. ఈ నెల 11వ తేదీనే శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. మరి శని ప్రదోష నాడు చేయాల్సిన పరిహారాలేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఈ రోజున శివుడిని పూజించుకుంటామని చెప్పుకున్నాం కదా. శని ప్రదోష వ్రతం రోజున శివలింగానికి గంగాజలం, పాలు, తేనెతో అభిషేకం చేయాలి. అలాగే శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రం, ఉమ్మెత్త పువులను సమర్పించాలి. ఇలా చేయడం వలన మనకు ఏమైనా శని దోషం ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుందట.
అనంతరం శివలింగానికి చందనం సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుందట. అలాగే శివుడికి గంగాజలంతో పాటు అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందట. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయట. శని ప్రదోష ఉపవాసం రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇక ఈ రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు, నూనె దానం చేయాలి. ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తే జీవితంలో జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. శనీశ్వరుడికి నీలం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిదట.