ఈ నెల 20వ తేదీన భానుసప్తమి రానుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భానుసప్తమి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. భానుసప్తమి రోజు ఇంట్లో తూర్పు దిక్కున ఓ పీట పెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం బియ్యం పిండితో వృత్తాకారంలో ముగ్గు వేసి దాని మధ్యలో దర్భలు పెట్టి ఒక నీళ్లు నింపిన బిందె పెట్టాలి. ఆ బిందెలో ఎర్రటి పువ్వులను వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ బిందెలోని నీళ్లను కొద్దిగా తీసుకుని వాటిని స్నానం చేసే నీటిలో కలిపి వాటితో స్నానం చేయాలి.
ఇక బిందెలో మిగిలిన నీటిని స్నానం చేసిన తర్వాత ఇంట్లోని అన్ని మూలల్లో సంప్రోక్షణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకి తావుండదు. ఇక స్నానానంతరం అర్ఘ్యం ఎలా సమర్పించాలో తెలుసుకుందాం. స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకుని, వాటిలో ఎర్రటి పుష్పలు, కుంకుమ కలిపిన అక్షింతలను వేయాలి. తూర్పు తిరిగి ‘‘ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం’’ అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అయితే అర్ఘ్యం సమర్పించే నీటిని కింద పడనివ్వకూడదు. దీనికోసం ముందుగానే ఒక ప్లేటును అమర్చుకోవాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత నీటిని చెట్లకు పోయాలి. ఒకవేళ ప్లేటును అమర్చుకోకున్నా తూర్పు వైపు చెట్లకు నీళ్లు పోస్తూ అయినా అర్ఘ్యం సమర్పించుకోవచ్చు.