ముద్గలుడి కథ గురించి తెలుసుకున్నాం కదా. ముద్గలుడు పక్షపవాసం అనే వ్రతాన్ని చేసేవాడు. ఆ వ్రతం కారణంగా పాడ్యమి నుంచి చతుర్దశి వరకూ ఉపవాసం ఉండి అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో మాత్రమే ఆహారాన్ని భుజించేవాడు. ఆయన సత్యనిష్ట ముల్లోకాలకూ వ్యాపించడంతో దుర్వాసుడు ఆయనను పరీక్షించదలిచాడు. పరీక్షించిన మీదట స్వర్గలోకం ప్రాప్తిస్తుందని ముద్గలుడికి వరం ఇచ్చాడు. దుర్వాసుడు వరం ఇచ్చినట్లుగానే కొన్నాళ్లకి దేవదూతలు ముద్గలుని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ముద్గలుని దేవవిమానంలో కూర్చోమంటూ ఆహ్వానించారు. ‘స్వర్గానికి వెళ్తాం బాగానే ఉంది. అక్కడి మంచిచెడులు ఏమిటో నాకు ఒక్కసారి తెలియచేయండి’ అని దేవదూతలను అడిగాడు ముద్గలుడు.
ముద్గలుడు అడిగిందే తరువాయి దేవదూతలు స్వర్గం వైశాల్యం గురించీ, అక్కడి అందచందాల గురించీ, సౌకర్యాల గురించీ తెగ వర్ణించారు. అక్కడ అందాలే తప్ప ఆకలిదప్పులు ఉండవనీ, సుఖాలే తప్ప రోగాలు ఉండవనీ ఊరించారు. ఇదంతా విన్న ముద్గలుడు సాలోచనగా- ‘మీరు స్వర్గంలో కనిపించే సానుకూలతల గురించి చెప్పారు. మరి అక్కడ ఏమన్నా దోషాలు ఉన్నాయా?’ అని అడిగాడు. ముద్గలుని ప్రశ్నకు దేవదూతలు కాస్త ఇబ్బందిపడుతూనే.. ‘భూమి మీద ఉన్నప్పుడు చేసిన పుణ్యాల వల్ల స్వర్గ ప్రాప్తి లభించింది కదా! అయితే అక్కడ మళ్లీ పుణ్యం చేసే అవకాశం ఉండదు. పైగా మీరు స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఆ పుణ్యం తరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం పూర్తిగా తరిగిపోతుందో… తిరిగి ఈ భూలోకం మీద జన్మించాల్సి ఉంటుంది. అలా స్వర్గాన్ని వీడే సమయంలో మనసు వేదన చెందక మానదు. పైగా భూలోకంలో తిరిగి జన్మించకా తప్పదు!’ అని తెలిపారు.