కార్తీక మాసం మొదటి రోజు కథ ఏంటంటే..

కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉన్న సమయంలో చేసే స్నాన, దాన, జపాలకు విశేష ఫలితాలు ఉంటాయి. ఇక కార్తీక వ్రతం ఆచరించాలని అనుకునేవారు తులా సంక్రమణం నుంచి గాని, శుద్ధ పాడ్యమి నుంచి గానీ ప్రారంభించాలి. మరి కార్తీక మాసమంతా రోజుకో కథ ఉంటుంది అని తెలుసుకున్నాం కదా.. తొలి రోజు కథ ముఖ్యంగా నదీ స్నాన మహత్యం గురించి ఉంటుంది. ఈ మాసంలో ఏ నదిలో స్నానం ఆచరిస్తే ఫలితం బాగుంటుందనేది కథలో వివరించడం జరిగింది. కార్తీకమాసంలో సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసిన వారి పుణ్యం పెద్ద ఎత్తున ఉంటుందట. సూర్యుడు ఎప్పుడైతే తులారాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. విష్ణుమూర్తి వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాల్లో కూడా వ్యాపించి ఉంటాడని నమ్మకం. కాబట్టి నదీ స్నానం చాలా మంచిదని అంటారు.

ఆ తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలిన తర్వాత మంత్ర జపం చేసి మూడు దోసిళ నీటిని గట్టు మీదకు జల్లిన తరువాత తీరం చేరాలి. అనంతరం ఒంటి మీద వస్త్రములను పిండాలి. దీనినే యక్ష తర్పణం అంటారు. అనంతరం పొడి వస్త్రాలను దరించి హరినామ స్మరణ చేయాలి. అనంతరం గోపీచందనంలో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించాలి. ఆపై సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత బ్రహ్మయజ్ఞమాచరించి పుష్పాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ తరువాత కార్తీక పురాణం చదవడమో లేదంటే వినడమో చేయాలి. సాయంకాలం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలను వెలిగించాలి. కార్తీక మాస వ్రతమాచరిస్తే పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతారని నమ్మకం. దీని వలన పాపాలన్నీ హరించుకుపోతాయట.

Share this post with your friends