చిన్మస్తికా దేవి తల ఏమైందనే దానిపై షాకింగ్ కథ ఏంటంటే..

హిమాచల్ ప్రదేశ్‌లోని చింతపూర్ణి దేవాలయం గురించి తెలుసుకున్నాం. అమ్మవారికి తల ఉండదు కానీ మన చింతలన్నింటినీ తీర్చేస్తుందట. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఆ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. క్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఉనా నుంచి 47 కి.మీ. దూరంలో సొలా సింఘి పర్వత శ్రేణులలో పర్వత శిఖరంపైన సుమారు 3,117 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ వరకూ మనకు తెలిసిందే. అయితే అమ్మవారికి తల ఎందుకు లేదు? అంటే రెండు కథలు ఉన్నాయి. ఒకటేంటంటే.. దక్షయజ్ఞంలో సతీదేవి మరణం తర్వాత ఆమె శరీరాన్ని భుజంపై వేసుకుని శివుడు విపరీతంగా దు:ఖిస్తున్నాడట. ఆయనను ఆ బాధ నుంచి విముక్తుడిని చేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడట. ఆమె శరీర భాగాలు పలు చోట్ల పడిపోయాయి. అమ్మవారి పాదాలు పడిన ప్రదేశమే చింతపూర్ణి ఆలయమనేది ఒక కథ.

దీని వెనుక మరో షాకింగ్ కథ కూడా ఉంది. అదేంటంటే… మార్కండేయ పురాణం ప్రకారం… చండీదేవి అసురులను సంహరించే సమయంలో ఆమెకు ఢాకిని, యోగినిగా పిలుచుకునే జయవిజయులు సాయపడ్డారట. వారు ఆ తరువాత ఎంతోమంది రాక్షసులను సంహరించి వారి రక్తాన్ని తాగినా వారి దాహం తీరలేదట. ఇంకా దాహార్తితో ఇబ్బంది పడుతూ ఉంటే.. అది చూసిన అమ్మవారు తన శిరస్సును ఖండించుకుని ఆ రక్తంతో వారి దాహాన్ని తీర్చిందట. అందుకే అమ్మవారికి తల ఉండదని చెబుతారు. ఇక ఈ అమ్మవారి ఆలయంలోని గర్భాలయంలోకి ప్రవేశించేవారు తప్పక తలపై ఏదో ఒక క్లాత్ వేసుకుని వెళ్లాలి. స్త్రీలైతే తలపై కొంగును కప్పుకోవాలి. తప్పక సంప్రదాయ దుస్తులనే ధరించాలి. తోలుతో తయారు చేసిన వస్తువులు వేటినీ కూడా ఆలయంలోకి అనుమతించరు.

Share this post with your friends