శని బాధలకు.. హనుమంతుడికి ఏంటి సంబంధం?

శని దేవుని కారణంగా మనం ఇబ్బందులు పడుతున్నట్టైతే హనుమంతుడి ఆలయంలో పూజలు నిర్వహించాలని చెబతూ ఉంటారు. అసలు హనుమంతుడికి శని దేవుడికి ఏంటి సంబంధం? ఎందుకు శని దేవుని కారణంగా ఇబ్బందులు పడేవాడు హనుమంతుడిని పూజించాలంటే దీనికి ఓ కథ ఉంది. శని దేవుడికి తన బలం చూసుకుని విపరీతమైన గర్వం ఉండేదట. హనుమంతుడి ధైర్యసాహసాల తెలుసుకుని ఆయన వద్దకు వెళ్లి యుద్ధానికి కాలు దువ్వాడు. ఆ సమయంలో హనుమంతుడు శ్రీరాముడి ధ్యానంలో ఉన్నాడు. ఇదే విషయాన్ని చెప్పినా కూడా శనిదేవుడు వినలేదు. యుద్ధానికి రమ్మంటూ మొండి పట్టు పట్టాడు.

హనుమంతుడికి కోపం వచ్చింది. శనిదేవుడిని తోకకు చుట్టి నేలకేసి కొట్టాడు. శనిదేవుడు దారుణంగా పరాజయం పాలయ్యాడు. పైగా బాగా దెబ్బలు కూడా తగిలాయి. అప్పటికి కానీ శనీశ్వరుడికి తన తప్పిదం తెలియలేదు. హనుమంతుడికి క్షమాపణలు చెప్పి ఇకపై శ్రీరాముడిని కానీ.. హనుమంతుడిని కానీ.. హనుమంతుడి భక్తులను కానీ ఎన్నడూ వేధించబోనని హామీ ఇచ్చాడు. శ్రీరాముడు, హనుమంతుడి భక్తులపై తన కరుణ ఉంటుందని చెప్పాడు. అందుకే హనుమంతుడిని పూజించుకుంటే శనీశ్వరుడు మన జోలికి కూడా రాడట. ఇక హనుమంతుడు.. శనిదేవుడికి నూనె రాయడంతో అతని గాయాల నుంచి ఉపశమనం లభించిందట. అప్పటి నుంచి శనిదేవుడి పూజకు నువ్వుల నూనెను వాడుతారు.

Share this post with your friends