
కేదార్‌నాథ్‌కు వెళ్లాలనేది ప్రతి ఒక్క హిందువూ కల. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్ ధామ్ విరాజిల్లుతోంది. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా అభివర్ణిస్తారు. ఇక్కడ అన్ని దేవాలయాలున్నాయి. ఈ యాత్రకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ఈ యాత్ర సమయంలో గౌరీకుండంలో స్నానం చేసిన మీదట కేదారేశ్వరుడి దర్శనానికి వెళతారు. ఎందుకు ముందుగా గౌరీకుండంలో స్నానం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కేదార్‌నాథ్ ధామ్‌కు 16 కి.మీ ముందు గౌరీ కుండం ఉంటుంది.
గౌరీకుండం అనేది సహజ సౌందర్యానికి మాత్రమే కాకుండా పురాణ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యమేంటంటే.. దీనికి పార్వతీ దేవి, వినాయకుడికి సంబంధం ఉందని చెబుతారు. అందుకే దీనికి పార్వతీ దేవి పేరు పెట్టారు. అసలు పార్వతీదేవికి, వినాయకుడికి ఈ ప్రదేశంతో సంబంధం ఏంటంటే.. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే పార్వతి దేవి శివుడిని భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసింది. ఇక వినాయకుడి శిరస్సును శివుడు ఖండించింది కూడా ఇక్కడేనని చెబుతారు. ఆ తరువాత ఏనుగు తలను అతికించి పునర్జన్మను ప్రసాదించాడు.
