
సుప్రజ అంటే మంచి బిడ్డ. కౌసల్య ముద్దు బిడ్డ ఐన రామా ! అని విశ్వామిత్ర మహర్షి పిలుపు. రాముడు దాశరథి. రాఘవుడు , లక్ష్మణాగ్రజుడు, రామచంద్రుడు. రాముణ్ణి మేల్కొలిపేటప్పుడు కౌసల్యమ్మ మహర్షికి ఎందుకు గుర్తు వచ్చింది.? ఆ తల్లి పెంపకంలో రాముడు లోకాభిరాముడయ్యాడు. ప్రతిరోజూ ఆమె మేలుకొలుపుతో లోకాన్ని చూసేవాడు. ఆ తల్లిని అనుకొంటూ రోజూ నిద్ర లేస్తాడు . కౌసల్య ముద్దు బిడ్డ రాముడు. కౌసల్య చాలా ధైర్యం, కర్తవ్య నిష్ఠ కలిగింది. విశ్వామిత్రులవారు అడగగానే దశరథ మహారాజు కొడుకును పంపలేదు. మోహం బంధించింది. ‘ఊన షోడశ వర్షోయం’ అన్నాడు. నేనే వస్తానయ్యా అని తప్పింపజూశాడు. ఒకసారి మూర్ఛపోయి లేచాడు. వశిష్ఠుడు ధైర్యం చెప్పగా అర్ధ మనసుతోనే పంపాడు.
విశ్వామిత్రుడు సులభకోపి అనే భయమూ దశరధ మహారాజుకు ఉంది. కౌసల్యమ్మ ఏకైక పుత్రుడు అడవులకు దీర్ఘ కాలం పోతున్నాడని తల్లిగా బాధ పడినా , కర్తవ్యం వెంటనే తెలుసుకొని సుపరీక్షితమై భద్రమని తెలిసిన పూజలో ఉన్న మూలిక తెచ్చి రాముడికి రక్షగా కట్టింది గానీ , దశరథుని మాదిరి డీలా పడిపోయి మంచం పట్ట లేదు. శ్రీ రాముడిలో తల్లి పెంపకంలోని ధైర్యం, కర్తవ్య అవ్యగ్రత మహర్షి దర్శించాడు. అందుచేత ఆ పిలుపు. ఆరు రోజులు జరిగే హవన క్రియ చక్కగా నెరవేర్చవలె.. అని ఆ పిలుపు వెనక ఋషి భావన. ఆ శ్రీ రాముడే ఆ శ్రీ కృష్ణుడే ఈ కలియుగ వైకుంఠంలో ఆర్త రక్షా దీక్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని సుప్రభాత దర్శనం చేసుకొనే పుణ్యాత్ములందరికీ తెలియజేస్తూ మీరు ఆ వైకుంఠుణ్ణే ఈ రూపంలో చూడండని ప్రతివాది భయంకర హస్తిగిరి(కంచి)నాథన్ అణ్ణన్ ఆచార్యులు సూచిస్తున్నారు. దశావతారాలతో ఈ భువికి వచ్చిన ఆర్తత్రాణ పరాయణుడూ ఈయనే అని విజ్ఞప్తి చేశాడాయన.
