దేవీ నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేస్తామని ముందుగానే తెలుసుకున్నాం.అలాగే కలశ స్థాపనకు శుభ సమయం ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇక కలశాన్ని ప్రతిష్టించే విధానం ఏంటో తెలుసుకుందాం. కలశ ప్రతిష్టాపన చేయడానికి శుభ్రమైన, పవిత్రమైన స్థలం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. ఇక కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకోవాలి. అనంతరం దానిలో బియ్యం, గోధుమలు, బార్లీ, శనగలు, నాణేలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి మామిడి ఆకులు పెట్టి దాని పైన కొబ్బరికాయను ఉంచాలి.
కలశ స్థాపన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ఆ తరువాత కలశానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తరువాత పీఠంపై పెట్టాలి. పసుపు, బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కలశాన్ని అలంకరించాలి. ఆ తరువాత అమ్మవారి మంత్రాలను జపిస్తూ కలశంలో నీటిని పోయాలి. ఆ తరువాత ధూపం వెలిగించాలి. ఇక ఆ తరువాతి నుంచి మొత్తం నవరాత్రులు నిర్వహించినన్ని రోజులు నియమ నిష్టల ప్రకారం కలశాన్ని పూజించండి. తొమ్మిది రోజుల పాటు పూజించిన తరువాత నవమి తిథి రోజున కలశాన్ని పీఠం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయాలి.