శ్రావణ మాసం శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తానే నిద్రలేని శుచిగా స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శివపార్వతుల చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకుని దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో కొంతమంది చిన్న శివలింగాన్ని పెట్టుకుని పూజ నిర్వహించుకుంటూ ఉంటారు. అలాంటి వారు సోమవారం నాడు శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించుకోవాలి. అనంతరం తుమ్మిపూలు, మారేడు దళాలతో శివాష్టోత్తరం చదువుతూ శివలింగానికి పూజ చేసుకోవాలి. పూజ పూర్తైన అనంతరం స్వామివారికి పండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి.
ఉదయం పూజ గురించి చెప్పుకున్నాం కదా.. ఇక సాయంకాలం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. సాయంత్రం తిరిగి స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. అనంతరం ఇంటి గుమ్మంలో దీపాలు వెలిగించాలి. ఆ తరువాత శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకుని శివాలయంలో కూడా దీపారాధన చేయాలి. తరువాత నక్షత్ర దర్శనం చేసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం స్వీకరించాలి. ఈ విధంగా కార్తీకమాసంలో అన్ని సోమవారాలు పూజతో పాటు ఉపవాసం ఉంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.