సాగర మథనం గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగరాన్ని మధించిన విషయం తెలిసిందే. అసలు అమృతం కోసం సాగరాన్ని ఎందుకు మధించాల్సి వచ్చిందనే దానికి ఓ కథ ఉంది. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని.. వాసుకిని తాడుగా చేసుకుని దేవతలు, రాక్షసులు సాగర మథనం చేశారు. సాగరంలో మంధర పర్వతం మునిగిపోబోతుంటే శ్రీ మహా విష్ణువే తాబేలులా మారి పర్వతం కింద ఉండి పర్వతాన్ని మోశారట. ఇక సాగర మథనానికి సంబంధించిన కథ హిందూ మత గ్రంథాలలో వివరించడం జరిగింది.
దుర్వాస మహర్షి ఇచ్చిన శాపంతో దేవతల నివాసమైన స్వర్గం.. కీర్తి, ఐశ్వర్యం లేకుండా వెలవెలబోయిందట. దీంతో విష్ణుమూర్తికి దేవతలు మొరపెట్టుకున్నారట. అప్పుడు దేవతలకు ఇచ్చిన సలహాయే సాగర మథనం. సముద్ర మథనం చేస్తే అమృతం లభిస్తుందని దీనిని తాగితే అమరులవుతారని విష్ణుమూర్తి చెప్పాడట. మరో కథేంటంటే.. రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి బాధలు చెప్పుకున్నారట. అప్పుడు మహావిష్ణువు.. రాక్షసులు బలంగా ఉన్నారు కాబట్టి వారితో సఖ్యంగా ఉంటూ క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభిస్తుందని దానిని తాగితే అమరులవుతారని చెప్పాడట. దీంతో క్షీర సాగర మథనం జరిగిందట.