తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి 11 కి.మీ దూరంలో ఉన్న జంబుకేశ్వర క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. దీని స్థల పురాణానికి సంబంధించి రెండు కథలున్నాయి. మొదటి కథ ప్రకారం.. పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి ఉండేవారు. అతను అత్యంత శివభక్తుడు కావడంతో శివయ్యను పూజించనిదే మంచి నీరు కూడా స్వీకరించే వాడు కాదట. శంభునికి ఒకరోజు శివుడిని ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలిగిందట. దీనికోసం తపస్సు ప్రారంభించాడట. భక్త సులభుడైన ఆ బోళాశంకరుడు శంభుని తపస్సుకి మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో మన్నాడట.
అప్పుడు శంభుడు.. శివుడిని ప్రత్యక్షంగా పూజించాలని కోరుకోవడంతో మెచ్చిన భోళా శంకరుడు లింగరూపుడై వెలుస్తానని.. నువ్వు జంబూ వృక్ష రూపంలో నన్ను పూజించుకోమని చెప్పి అంతర్థానమయ్యాడట. నాటి నుంచి శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు లింగంగా ఆవిర్భించగా, శంభుడు జంబు వృక్షమై పూజించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడని భక్తుల విశ్వాసం. రెండో కతేంటంటే. జంబుకేశ్వరం క్షేత్రంలో కూడా స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటీ పడి పూజిస్తుండేవట. వాటి భక్తికి మెచ్చిన శివుడు మోక్షాన్ని ప్రసాదించాడని చెబుతారు.