ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్ ఆలయ చరిత్ర ఏంటంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొలువైన హనుమంతుడి గురించి తెలుసుకున్నాం కదా. ఈ హనుమంతుడి ఆలయాన్ని బడే హనుమాన్ దేవాలయమని.. లేటే హనుమాన్ మందిర్ అని కూడా అంటారు. ఇక్కడి హనుమంతుడు కొంత భాగం గంగా నీటిలో ఉండటం విశేషం. ఇక్కడ హనుమంతుడు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పడుకుని కనిపించడం మరో విశేషం. ఇక ఈ దేవాలయ చరిత్ర చాలా ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. సుమారు 600-700 సంవత్సరాల మధ్య నిర్మితమైనదని చెబుతారు. ఈ ఆలయ శంకుస్థాపనకు సంబంధించి ఒక ఆసక్తికర కథ ప్రచారంలో ఉంది.

కన్నౌజ్ నగరంలో అప్పట్లో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడట. అతను తన కోరికలు నెరవేర్చుకోవడానికి విధ్యాంచల్ కొండలలో హనుమాన్ దేవాలయాన్ని నిర్మించి దానిలో ప్రతిష్టించేందుకు భారీ హనుమంతుడి విగ్రహాన్ని తయారు చేయించి వివిధ పవిత్ర స్థలాలలో స్నానం చేయించాడు. హనుమంతుడి విగ్రహం ప్రయాగ్‌రాజ్‌లోని సంగమం వద్దకు చేరుకున్నప్పుడు, అతనికి ఒక స్వప్నం వచ్చిందట. ఆ కలలో ఈ విగ్రహాన్ని అక్కడే వదిలితే అతని కోరికలు నెరవేరుతాయని సూచన వచ్చిందట. వెంటనే ఆ ధనిక వ్యాపారి ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేశాడట. కాలక్రమంలో విగ్రహం ఇసుకలో కప్పబడి, గంగా నీటిలో మునిగిపోయింది. తరువాత రామ భక్తుడైన బాబా బాలగిరి జీ మహారాజ్ ఈ విగ్రహాన్ని కనుగొని దానికి పూజలు నిర్వహించడం మొదలు పెట్టారట.

Share this post with your friends