అక్షయ తృతీయ వస్తోందంటేనే హిందువులు ఆనందిస్తూ ఉంటారు. ఆ రోజున తప్పకుండా స్తోమతను బట్టి ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకుంటే ఇల్లు ఆర్థికంగా కళకళలాడుతుందని నమ్మకం. అయితే వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే మరీ మంచిదట. కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముందుగా అక్షయ తృతీయ ఎప్పుడు రానుంది? ఆ రోజున శుభ సమయం ఏంటి? తెలుసుకుందాం. వాస్తవానికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు.
అసలు వైఖాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగనైనా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటా కాబట్టి అక్షయ తృతీయను ఏప్రిల్ 30న జరుపుకుంటాం. అక్షయ తృతీయ రోజున శ్రేయస్సుకు చిహ్నమైన బంగారం కొనడం చాలా మంచిదని చెబుతారు. బంగారం కొనేంత స్తోమత లేని వారు ఇతర వస్తువులను అయినా కొనుగోలు చేయవచ్చు. అయితే ఏదైనా కొనుగోలు చేసేందుకు శుభ సమయం వచ్చేసి ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.