జ్యేష్ఠ మాసం ప్రత్యేకత ఏంటి?

చాంద్రమానం ప్రకారం చైత్ర .. వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు … పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ … పాపాలను పరిహరించుకోవడానికి దైవసేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెలరోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పార్వతీదేవి ఆచరించిన ‘రంభావ్రతం’ … వివాహిత స్త్రీలు ఆచరించే ‘అరణ్యగౌరీ వ్రతం’ … గంగానది స్నానంతో పదిరకాల పాపాలను హరించే ‘దశాపాపహర దశమి’, ‘త్రివిక్రమ ఏకాదశి’ పేరుతో పిలవబడే ‘నిర్జల ఏకాదశి’ భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి. అలాగే సూర్యుడిని ఆరాధించే ‘మిథున సంక్రమణం’ వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ‘ఏరువాక పున్నమి’ ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’ శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అంతే కాదు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నవి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను … మరెన్నో విశేషాలను సంతరించుకుని , పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ ఉంటుంది.

Share this post with your friends