
శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చిందనడానికి రెండు కథలు తెలుసుకున్నాం. దాని ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివుడి మూడో నేత్రాన్ని అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం అని పిలుస్తారు. ఇందుకు నిదర్శనంగా మన్మథుని కథను చెబుతారు. దేవతలంతా చెప్పడంతో లోకకల్యాణార్థం పూలబాణంతో శివుని మనసులో ప్రణయ భావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రసరించేలా చేశాడు మన్మథుడు. అప్పుడు శివుడి అంతరంగంలో అలజడి చెలరేగుతుంది. దానికి అలజడికి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడి దృష్టి మన్మథుడిపై పడుతుంది. వెంటనే మన్మథుడిని తన అగ్నినేత్రంతో బూడిద చేశాడు.
మూడో నేత్రమనేది మన కళ్లలాంటిది కాదట. ఇదొక భౌతిక నేత్రమని చెబుతారు. ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు కాక మనకు ఎలా కావాలో అలా చూపిస్తుందట. కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంది కదా. దీనికి ముందు మన్మథుడు గురించి తెలుసుకుందాం. మన్మథుడంటే వ్యక్తి కాదు.. మనసును మథించేవాడు. అంటే మనసులోకి కోరికలు. వాటిని భస్మం చేసే అగ్ని రూపమే త్రినేత్రం. లోకంలో కనిపించే ప్రతి వస్తువూ ఏదో ఒక సందర్భంలో మనకు కావాలనిపిస్తుంది. అదసలు మనకు అవసరమా? అనవసరమా? అనేది ఆలోచించేలా చేసి అనవసరమైతే భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడోకన్ను. మన్మథుడు మసికావడం అంటే మనలోని కోరిక నశించడం.
