స్వయంపాకం అంటే ఏమిటి? అది ఎవరికి ఇవ్వాలి?

స్వయంపాకం అనే పదాన్ని సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం. అయితే స్వయంపాకానికి అర్థం చాలా మందికి తెలియదు. దాని అర్థమేంటి? అసలు స్వయం పాకానికి కావల్సిన సామాగ్రి ఏంటి? అది ఎవరికి ఇస్తే మంచిదో తెలుసుకుందాం. స్వయంపాకం అంటే స్వంతంగా వండుకొని తినడమని అంతా అనుకుంటాం. కానీ.. స్వయంపాకం అంటే స్వయంగా వండుకుని తినడానికి కావలసిన సామగ్రిని ఇవ్వడమని అర్థం. ఈ స్వయంపాకంలో బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, చింతపండు, బెల్లం, నెయ్యి, నూనె మొదలైనవి ఇవ్వాలి.

విశిష్ట మాసాలలో, పర్వదినాలలో, అమావాస్య నాడు, సంక్రమణ సమయంలో, ఏకాదశి తెల్లవారి ద్వాదశి నాడు, తల్లిదండ్రుల తిథినాడు, గ్రహణం రోజు ఈ వస్తువులను కనీసం ఒక్కపూట వంటకు సరిపడేలా సమకూర్చి ఒక అరటి ఆకు లేదా విస్తరిలో పెట్టి పురోహితునికి దానం చేయాలి.
తిథి రోజు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని వారు బ్రాహ్మణునికి ఈ స్వయంపాకం దానం, దక్షిణ తాంబూలాదులతో సమర్పించాలి. తోటకూర, గుమ్మడిపండు యథాశక్తి ఇవ్వవచ్చు. మన ఇంట్లో భోజనం చేయని సంప్రదాయ కుటుంబాలకు చెందిన వారికి ఈ విధమైన స్వయంపాక దానం ఇస్తారు. నిత్యాగ్ని హోత్రులైన కొందరు స్వయంగా వండుకొని, భగవంతునికి నైవేద్యం సమర్పించి, తదనంతరం భోజనం చేస్తారు.

Share this post with your friends