
విశాఖ నగరంలోని సంపత్ వినాయకుడి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వినాయకుడి ఆలయం అసలు దేనికి ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలో విశాఖ వాసులు ఎవరైనా కొత్త బైక్ లేదంటే ఎలాంటి వాహనమైనా సరే కొనుగోలు చేస్తే ముందుగా ఈ ఆలయానికి వచ్చి పూజ చేయించుకుంటారు. ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతే వాహనం రోడ్డెక్కుతుందట. ఇక్కడ పూజ చేయించుకుంటే ఎలాంటి ప్రమాదమూ జరగదని అక్కడి వారి నమ్మకం. అందుకే ఈ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ది గాంచింది.
గణపతి నవరాత్రులు ఇక్కడ అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలలో స్వామివారిని బాల గణపతి, ఆది గణపతి, విద్యా గణపతి, రాజ గణపతి, శక్తి గణపతి, శివపూజ గణపతి, స్కంద గణపతి, అగస్త్యపూజ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి అనే తొమ్మిది అవతారాలలో అలంకరిస్తారు. ఇక్కడ పూజలన్నీ ఆలయాన్ని నిర్మించిన సంబధన్ కుటుంబీకులు వారు స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఈ ఆలయంలో పూజలు తెలుగు – తమిళ సంప్రదాయాల కలయికలో జరుగుతుంటాయి.
