30 పాశురాల విశిష్టతేంటో తెలుసుకున్నాం కదా.. అయితే ఆ పాశురాలలో ఏముందో తెలుసుకుందాం. మొదటి అయిదు పాశురాలలో ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాయి. 5 నుంచి 15 పాశురాల్లో పల్లె వాతావరణం వర్ణన ఉంటుంది. గోదాదేవి చెలులతో కలిసి వనంలో పూలు సేకరిస్తూ వర్ణిస్తూ ఉంటుంది. రంగురంగుల పూలతో పాటు వనంలో వినిపించే పక్షుల కిలకిలారావాలు, వెన్నను చిలికే క్రమంలో వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం తదితర అంశాల వర్ణనలు ఉంటాయి. అంతేకాకుండా గోదాదేవి ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి తన నిద్రలేపి నదీ స్నానానికి సిద్ధం చేసే క్రమంలో విష్ణువు అవతారాలను సైతం కొనియాడుతుంది.
15 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనతో పాటు భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. అలాగే దేవాలయ పరిరక్షుల అనుమతితో గోదాదేవి, ఆమె చెలులు గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామకృష్ణులను మేల్కొనాలంటూ వేడుకుంటారు. అనంతరం కృష్ణుడి అష్ట భార్యల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. చివరి తొమ్మిది పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి స్వయంగా పాడానని చెబుతుంది. అలాగే ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో, వారికి భగవంతుని కృప తప్పక కలిగి తీరుతుందట. పెళ్లికాని యువతులు ఈ కీర్తనలు గానం చేస్తే తప్పక కల్యాణ యోగం కలుగుతుందట.