ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. బోనాల సందడి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు మొత్తం బోనమెత్తుతాయి. ప్రతి ఆదివారం ఎంతో సందడిగా సాగిపోతూ ఉంటుంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ ఇలా రకరకాల పేర్లతో ఉండే అమ్మవారికి తమను చల్లగా చూడాలంటూ ఉంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి బోనం సమర్పిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. తమ ఇంటికి, ఊరికి ఎలాంటి కష్టమూ రాకుండా చూడాలని అమ్మవారిని భక్తులు మొక్కుకుంటూ ఉంటారు.
కేవలం తెలుగు వారికి మాత్రమే సొంతమైన పండుగ ఇది. భోజనానికి వికృతే బోనం. అమ్మవారికి ఇలా భోజనం పెట్టే సంప్రదాయం ఎక్కడా కనిపించదు. ఇక కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలోనూ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. తెలంగాణ, రాయలసీమల్లో ఆషాఢంలో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ బోనాన్ని రాగి లేదంటే మట్టి కుండలో సమర్పిస్తారు. ముందుగా కుండను పసుపు, కుంకుమతో అందంగా అలంకరించి దానికి వేపాకులు చుట్టి దానిలో బెల్లంతో తయారు చేసిన అన్నం లేదంటే కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నాన్ని పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.