ధనుర్మాసంలో దీపారాధన చేస్తే ఏం జరుగుతుందంటే..

శ్రావణమాసం, కార్తీక మాసం మాదిరిగానే ధనుర్మాసానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. దివ్యప్రార్థనకు అనువైన మాసమని ఈ మాసాన్ని పేర్కొంటారు. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఈ నెల రోజుల పాటు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పఠనం చేస్తారు. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, పొంగల్ ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.

ముఖ్యంగా ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. తద్వారా దరిద్రం దూరమవుతుందని విశ్వాసం. అలాగే వేకువజామున నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు పెట్టాలి. వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. కొంత మంది ధనుర్మాస వ్రతం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి హ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో వివరించడం జరిగింది.

Share this post with your friends