లలితా దేవి ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం కదా. భండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి లలితా దేవి ఆవిర్భవించిందని తెలుసుకున్నాం. అసుర సంహారం తరువాత అమ్మవారిని శాంతింపజేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే ‘శ్రీ లలితా సహస్రనామం’ గా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితా దేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితాసహస్రనామాన్ని పఠిస్తారు. అరుణవర్ణంలో ప్రకాశిస్తూ, పాశాన్నీ, అంకుశాన్నీ, పుష్పబాణాలనూ,ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది.
శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి, శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి, లలితాసహస్రనామ, పారాయణ చేస్తే… కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళ ల్లోప్రావీణ్యాన్నీ, కుటుంబసౌఖ్యాన్నీ, ప్రశాంతతనూ, సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమిరోజున. పవిత్రస్నానాలు చేసి, లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ, అలాగే ‘ప్రాతః స్మరామి లలితా వదనార విందం…’ అంటూ ప్రారంభమయ్యే ‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’ పారాయణ కూడా విశేష ఫల ప్రదం.