వరుణ దేవుడు.. వాయుదేవుడు గొప్పని అంగీకరించబోతుంటే ఏం జరిగిందంటే..

వరుణ దేవుడు, వాయుదేవుడికి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. చివరికి వాయుదేవుడే గొప్పని వరుణుడు అంగీకరించే సమయంలో సూర్య భగవానుడు ఎంట్రీ ఇచ్చి మరీ కాదని చెప్పాడు. అప్పుడు వాయు దేవుడు తన గొప్పతనాన్ని అంగీకరించడం లేదా? అని ప్రశ్నించాడు. అప్పుడు సూర్యుడు దీనిలో చెప్పడానికేముంది? విపరీతమైన తేజస్సుతో తాను ప్రకాశిస్తే తనకు కూడా మానవులు భయపడిపోతారని చెప్పాడు. మనమున్నది మేలు చేయడానికి.. ఆ విషయం మరిచి ఇలా ప్రజల ఉసురు పోసుకోవడమేంటంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకరేమో వారం రోజులు వరుసగా కుంభవృష్టి కురిపిస్తే.. మరొకరు తీవ్ర గాలులతో భయపెట్టడం మీకు తగునా? అని సూర్యుడు ప్రశ్నించాడు.

తామిద్దరిలో ఎవరు గొప్ప అనేది తేల్చుకోవడానికే ఇలా చేశామని వరుణ దేవుడు పేర్కొన్నాడు. అప్పుడు సూర్యుడు.. మీలో ఎవరు గొప్పో తెల్చడానికి ఇంద్రుడినో, ఋషులనో అడగాలి కానీ ప్రజలను బాధపెట్టడమేంటని ప్రశ్నించాడు. అది తప్పెలా అవుతుందని ఇద్దరూ ఎదురు ప్రశ్నించారు. ముమ్మాటికీ తప్పే అవుతుందని.. మీ చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు చేశారని చెప్పారు. వారికి దిక్కుతోచక మిమ్మల్ని ప్రార్ధించారని.. అలా కాకుండా మన మీద భక్తితో లేదంటే గౌరవంతో పూజిస్తే అది గొప్పని సూర్యుడు అన్నాడు. భక్తితో పూజింపజేసుకునేలా ఎలా చేయాలో వివరించాలని కోరాడు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని.. నీటి మట్టాలు తగ్గితే అవసరమైన చోట వానలు కురిస్తే వరుణుడిని దేవుడిని మొక్కుతారన్నారు. ఎండలు పెరిగి వేడి పెరిగితే చల్లని గాలి వీచి ఉక్కపోత నుంచి ప్రజలను రక్షించాలని హితవు పలికాడు. అలాకాకుండా ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ప్రజలను ఇబ్బంది గురి చేయవద్దని తెలిపాడు. భవిష్యత్తులో అలా చేయకుండా చూసుకుంటామని వరుణుడు, వాయు దేవుడు.. సూర్యుడికి మాటిచ్చారట.

Share this post with your friends