మొత్తానికి దేవదూతలను అడిగి స్వర్గంలో ఏం ఉంటుందో ముద్గలుడు అక్కడకు వెళ్లే దారిలోనే తెలుసుకున్నాడు. ముందుగా దేవదూతలు స్వర్గంలోని సానుకూలతల గురించి వివరించారు. అక్కడ ఆకలిదప్పులకు తావుండదని.. సుఖాలు తప్ప రోగాలకు చోటుండదని చెప్పారు. అంతా విన్న ముద్గలుడు స్వర్గం ప్రతికూలతల గురించి తెలుసుకున్నాడు. స్వర్గంలో పుణ్యం చేసే అవకాశమే ఉండదని ఆయనకు దేవదూతలు తెలిపారు. అంతేకాకుండా మరో ప్రతికూలత కూడా వివరించారు. అది విన్న తర్వాత ముద్గలుడు ఏం చేశాడో తెలుసుకుందాం.
స్వర్గంలో మంచి, చెడుల గురించి తెలుసుకున్నాక ముద్గలుడు ఏం చేశాడో తెలుసుకుందాం. స్వర్గంలో సుఖం అనుభవిస్తున్న కొద్దీ పుణ్యం తరిగిపోయి తిరిగి భూలోకంలో జన్మించాల్సి ఉంటుందని దేవదూతలు చెప్పాక ముద్గలుడు కాసేపు ఆలోచించాడు. అనంతరం.. ‘అయ్యా! ఈ స్వర్గమేదో మళ్లీ సంసారబంధాన్ని కలిగించేదిగానే ఉంది కదా! పుటుక, చావుల చక్రంలోకి మళ్లీ దించేదిగానే ఉంది కదా. కాబట్టి నాకు అలాంటి స్వర్గం వద్దుగాక వద్దు. ఎప్పటికీ సంసారంలోకి రాని ‘జన్మరాహిత్యమే’ నాకు కావాలి. ఇక మీదట అలాంటి మోక్షం కోసమే నేను సాధన చేస్తాను. దయచేసి మీరు వెళ్లిరండి,’ అంటూ ఆ దేవదూతలను పంపి వేశాడు. అటుపై సన్యాసాన్ని స్వీకరించి తపస్సాధనలు చేసి మోక్షాన్ని సాధించాడు.