
బీహార్‌లోని గయలో విష్ణుమూర్తి క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ శ్రీరాముడు, పాండవులు తమ పూర్వీకులకు శ్రాద్ద కర్మలు నిర్వహించారట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ పితృదేవతగా కొలువయ్యాడట. అసలు ఈ ఆలయ స్థల పురాణమేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గయాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. అదేంటంటే.. తనను చూసిన వారికి పాపాలు నశించి.. మోక్షం పొందేలా వరం పొందాడు. ఈ వర ప్రభావంతో ప్రజలు గయాసురుడిని చూసి సులభంగా మోక్షం పొందేవారు.
దీని కారణంగా యమలోకంలో జనసమూహం బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా భూమిపై కూడా మతపరమైన నియమాలు ఉల్లంఘించడం ప్రారంభమైంది. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి విషయాన్ని వివరించారు. అప్పుడు విష్ణుమూర్తి యజ్ఞం కోసం గయాసురుడిని శరీరం ఇవ్వమని కోరాడు. విష్ణుమూర్తి అంతటి వాడు అడగటంతో వెంటనే గయాసురుడు సైతం అంగీకరించాడు. గయాసురుడి శరీరం చాలా పెద్దగా ఉండటంతో అతనిపై దేవతలు యజ్ఞం చేసేందుకు ఇబ్బంది పడ్డారు. చివరికి శ్రీ మహావిష్ణువు తన పాదంతో గయాసురుడిని తొక్కి రాయిగా మార్చేశాడు. ఆ ప్రదేశమే గయ. ఇక గయాసురుడి భక్తి, త్యాగానికి సంతోషించిన విష్ణువు ఈ ప్రదేశంలో ఎవరైతే తమ పూర్వీకుల కోసం పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మకు చేస్తారో వారికి నేరుగా స్వర్గం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడట.
