భక్తి మార్గంలోని పరమ సూత్రాన్ని శ్రీకృష్ణుడు ఏమని బోధించాడు?

సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః ।
అనన్యనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ॥

ఈ శ్లోకం భగవాన్ శ్రీకృష్ణుడు భక్తి మార్గంలోని పరమ సూత్రాన్ని మనకు బోధిస్తున్నాడు. మన కర్మలన్నింటినీ ఆయనకు అర్పణగా సమర్పించి, ఫలాపేక్ష లేకుండా కేవలం భగవంతుని సంకల్పం కోసం చేయమని చెబుతున్నాడు. “మయి సన్న్యస్య” అంటే ప్రతి కర్తవ్యాన్ని నాపై అర్పించి అని భావం. ఇక్కడ “మత్పరాః” అంటే నన్నే లక్ష్యంగా చేసుకున్నవారు, తమ జీవితం, ప్రయత్నాలు, కర్మలు అన్నీ నాలోనే కలిపినవారు. అనన్యభావంతో యోగం అంటే.. మనసు ఎటూ తిప్పుకోకుండా, దైవస్మరణలో నిలిచి ఉండటం.

ఇలాంటి యోగి తన కర్మలో కూడా ధ్యానం చేస్తాడు, ధ్యానంలో కూడా కర్మచేస్తాడు. అతనికి లోకంలో భేదం ఉండదు. యజ్ఞం, సేవ, ప్రేమ అన్నీ దైవస్వరూపం అవుతాయి. భగవంతుని స్మరణతో చేసిన ప్రతి కార్యం పూజ అవుతుంది. అప్పుడు మన జీవితం కేవలం కర్మయోగం కాదు.. అది భక్తియోగం అవుతుంది. మనం దైవచింతనతో ప్రతి పని చేస్తే, ఆ పనులన్నీ మలినతలేని పుణ్యకర్మలుగా మారతాయి. ఇది మనకు చెబుతుంది. “కర్మ చేయి, కానీ దైవానికి అర్పణభావంతో చేయి. ఫలంపై కాకుండా భగవంతునిపై దృష్టి పెట్టు.” ఇలా జీవించే వాడు యోగంలోనే ఉంటాడు, ఆయన జీవితం ఆధ్యాత్మిక సమర్పణ అవుతుంది.

Share this post with your friends