
మొత్తానికి చిలుకను ఎలాగైనా రక్షించాలని.. ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి వెళ్లారు. అలా యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. “అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి కర్మఫలాల లెక్కింపు, ప్రాణాల హరింపు బాధ్యతను యమలోకానికి అప్పగిస్తారు, అలా వచ్చినవారి లలాట లిఖితాన్ని అనుసరించి, వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాము. ఆ రాత ప్రకారం ఎవరి ఆకు ఎప్పుడు రాలి కిందపడుతుందో వారు ఆయా సమయంలో అందులో రాసిన విధంగా చనిపోతారు. మీ చిలుకకు సంబంధించిన ఆకును ఆ వరుసలో నుంచి తొలిగించాక దాని మరణాన్ని మార్చేసే పనిచూద్దాం, పదండి ముందైతే వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడుదాం” అని అన్నాడు యముడు.
త్రిమూర్తులు, యముడు సాధారణంగా ఒకేసారి కలసికట్టుగా ఒక చోటికి వెళ్లడం దాదాపు జరిగే పని కాదు. అయినా ఇంద్రుని ప్రార్థన, ఇంద్రాణి కోరిక తీర్చాలనే ఆకాంక్షించతో వారు నలుగురు కలువాల్సిన అత్యంత అరుదైన సన్నివేశం అది. సరే మొత్తానికి అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఆ గదిలోని ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా.. “ఎప్పుడైతే ఈ గదిలోకి యమధర్మరాజు గారు, విష్ణు ఈశ్వర బ్రహ్మాదులతో కలసి దేవేంద్రుడిని వెంటబెట్టుకుని వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..”
నిజానికి చిలుక జనన సమయంలో బ్రహ్మ అలా రాయడాన్ని చూసిన చిత్రగుప్తుల వారు, ఇక ఈ చిలుకకు మరణం అసాధ్యమని, బ్రహ్మ గారు ఏ చిత్తములో ఉండి ఇలాంటి అసాధ్యమైన మరణ శాసనం రాశాడో కానీ ఈ ప్రాణి యుగాంతాల వరకూ బతికే అవకాశాన్ని పొందింది. దీనిదెంత అదృష్టమో కదా అని భావించారట, కానీ చిత్రగుప్తుడు భావనను పటాపంచలు చేస్తూ యమలోకంలో అంతమంది దేవతలు కలిసే సందర్భం రావడం, దీర్ఘాయుష్షు ఉందనుకున్న అట్టి చిలుక ప్రాణాలు హరించబడటం చూసి చిత్రగుప్తుల వారు అవాక్కయ్యారట.. చూశారా.. ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరని ఈ కథ చెబుతోంది.
