
వాతాపి, ఇల్వలుడు మనుషులను పీక్కుతుంటున్నవైనాన్ని మునులంతా వెళ్లి అగస్త్యుడికి చెప్పారు. అగస్త్య మహర్షి గొప్ప పండితుడు మాత్రమే కాకుండా జ్ఞాని. కాబట్టి వెంటనే ఆయన ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు. మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించి వాళ్ల నివాసానికి వెళ్లాడు. యథా ప్రకారం ఇల్వలుడు.. ‘తమరు స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. నేను క్షణంలో వంట చేస్తాను’ అని చెప్పి వంటగదిలోకి వెళ్లాడు. ఆ తరువాత ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.
తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలుసు కాబట్టి భోజనం చేయగానే పొట్ట మీద మెల్లగా “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అని రుద్దాడు. ఇది ఇల్వలుడికి వినిపించలేదు. ఆయన చెయ్యి కడుక్కోడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు “వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా!” అని గట్టిగా పిలిచాడు. కానీ ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. అప్పుడు ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వుతో ‘నీ తమ్ముడు వాతాపి నా పొట్టలో జీర్ణమై పోయాడు‘ అని చెప్పాడు. అప్పుడు ఇల్వలుడికి విషయం అర్థమై మహర్షి కాళ్లపై పడి తనను ప్రాణాలతో విడిచి పెట్టమని వేడుకున్నాడు. ఇక మీదట ఎవరినీ చంపనని ప్రమాణం చేసి అడవి వదిలి వెళ్లిపోయాడు. ‘ఇల్వల’ అంటే చెడునడత గలిగన మనసు అని అర్ధం. ‘వాతాపి’ అంటే సర్వప్రాణుల్నీ హరించేవాడు అనే అర్ధాన్నిస్తుంది.
