ద్వారకను శ్రీకృష్ణుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో తెలుసుకున్నాం కదా. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. గోమతీ నదీ తీరంలో ఈ ద్వారకను కన్నయ్య నిర్మించాడు. ఇది చూసేందుకు అత్యంత అందంగా అద్భుతంగా.. ప్రకృతి సోయగంతో మనసును కట్టిపడేసేది. అలాంటి ద్వారక నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసి పోయింది. అంటే శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత ఇది జరిగింది. అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీ.పూ.3138లో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత చాలా కాలం పాటు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. అయితే ద్వారక సముద్రంలో మునిగిపోవడానికి రెండు కారణాలు చెబుతారు. ఓ శాపం ప్రకారం, కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల యాదవ సామ్రాజ్యం పతనం అయినట్లు ఒక కారణంగా చెబుతారు. మరో కారణమేంటంటే.. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని చెబుతారు.