
పూణేలోని త్రిసూంద్ గణపతి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇది సోమ్వర్ పేట్ జిల్లాలోని నజగిరి అనే నదీ తీరంలో ఉంది. ఇక్కడ వినాయకుడు మూడు తొండాలతో మయూర సింహాసనాన్ని అధిష్టించి దర్శనమిస్తాడు. ఇక్కడి విఘ్నేశ్వరుడికి ఆరు చేతులు ఉంటాయి. ఈ ఆలయం ఈనాటిది కాదు.. 1754 కాలం నాటిది. ఇండోర్ సమీపంలోని ధంపూర్కు చెందిన భీమ్జిగిరి గోసావి అనే భక్తుడు ఈ ఆలయ నిర్మాణాన్ని అప్పట్లో ప్రారంభించాడట. ఈ ఆలయంలో వినాయకుడిని 16 ఏళ్ల తర్వాత అంటే 1770లో ప్రతిష్టించారట.
ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూపరులను అబ్బుర పరుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం మూడు శైలిల సమ్మిళితం. రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలులను మిళితం చేసి, దక్కన్ రాతి బసాల్ట్ ఉపయోగించి నిర్మించబడింది. ఇక ఆలయంలోని గర్భగుడి గోడలపై మనకు భగవద్గీత శ్లోకాలు దర్శనమిస్తాయి. సంస్కృతం, పర్షియన్ భాషలలో ఇవి చెక్కబడి ఉంటాయి. ఆలయం ఎత్తైన వేదికపై ఉంటుంది. మెట్లు ఎక్కి వెళ్లగానే మనకు ముందుగా ద్వారపాలకుల విగ్రహాలు స్వాగతం పలుకుతాయి. ఎన్నో రకాల జంతువుల అందమైన విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయంలో అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో బంధిస్తున్న శిల్పం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో విగ్రహం కింద ఒక గది ఉంటుంది. దానిలో ఆలయాన్ని నిర్మించిన మహంత్ శ్రీ దత్తగురు గోసవి మహారాజ్ సమాధి కూడా ఉంది.
