తిరుఉత్తర కోసమాంగై శివాలయ విశేషాలేంటంటే..

రామేశ్వరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న “తిరుఉత్తర కోసమాంగై” శివాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడే తొలిసారిగా శివుడు వెలిశాడని చెబుతారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుందని కూడా తెలుసుకున్నాం కదా. అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతంగా పేర్కొంటారు. ఆలయ ప్రాంగణంలో 3000 సంవత్సరాల క్రితంనాటి రేగిపండు చెట్టు ఉంది. ఈ ఆలయంలో శివుడు అన్ని ఆలయాల్లో మాదిరిగానే లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు.

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయంలోని గర్భాలయంలో శివుడు మూడు రూపాలలో దర్శనమిస్తాడు. శివలింగ రూపంలో, మరకత నటరాజ రూపంలో, స్పటిక లింగంలో శివుడు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. నటరూజ రూపంలో 5 అడుగుల మరకతంతో చేయబడిన శివుడు మనకు గర్భాలయంలో దర్శనమిస్తాడు. ఈ శివుడు అత్యంత విశిష్టమైనదని పేర్కొంటారు. ఎందుకంటే ఇక్కడి మరకతం నుంచి వచ్చే ప్రకంపనలను సాధారణంగా మనం తట్టుకోలేమని భావిస్తూ ఉంటారు. అందుకే స్వామివారిని ఎప్పుడూ విభూదితో కప్పి మాత్రమే ఉంచుతారు.

Share this post with your friends