
విజయనగరం జిల్లాలోని రామతీర్ధంలో సీతారాములు కొలువై ఉన్నారు. విజయనగరం వెళ్లిన వారంతా ఈ ఆలయాన్ని దర్శించుకోకుండా తిరిగి రారు. ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకున్నవారు దాని పక్కనే ఉన్న బోదికొండను సైతం దర్శించుకుంటారు. 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ దేవాలయ నిర్మాణం జరిగిందట. ఇక రామతీర్థానికి సమీపంలో బోదికొండ ఉందని చెప్పుకున్నాం కదా. దీనికి పెద్ద చరిత్రే ఉంది. ఈ కొండకు కూడా పురాణాలతో సంబంధం ఉంది.
రామతీర్ధం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోదికొండ, దాని అద్భుతమైన లక్షణాలు, చరిత్రతో ప్రత్యేకమైనది. ఈ కొండ పురాణాలతో పాటు చారిత్రక సంబంధాన్నిసైతం కలిగి ఉంది. బోదికొండ అనేది ఏకరాతిశిల. దీనిపైనే రాములవారి ఆలయాన్ని నిర్మించారు. పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ నివసించారని చెబుతారు. ఈ కొండపై ఒక కొలను కూడా ఉంటుంది. ఈ కొలనులో వేసిన నాణేలు లేదంటే ఏవైనా వస్తువులు కాశీలో తేలతాయని నమ్మకం. ఇక ఈ కొలనులో నీరు ఎండకాలంలో సైతం ఎండిపోదు. బోదికొండపై భీముడి గృహం అని పిలవబడే ప్రదేశం కూడా ఉంది. భీముడు పడిపోతున్న పర్వతాన్ని తన తలతో నిలిపాడట.
