శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటంటే..

శివుడు అభిషేక ప్రియుడనేది తెలిసిందే కదా. శివలింగానికి నీటితో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని నీళ్లతో అభిషేకించినా చాలట.. శివుడు ఆనందభరితుడై మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడట. నీటిలో ఉన్న స్వచ్ఛత ప్రకృతికి ప్రాణమిచ్చే శక్తిని ఇస్తుందట. అలాంటి నీటితో శివయ్యను జలంతో అభిషేకిస్తే మానవులకు ఎదురయ్యే ప్రతికూలతలన్నింటినీ తొలగిస్తాడని విశ్వాసం. అలాగే శివలింగానికి మనం అభిషేకం నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

శివలింగానికి అభిషేకం చేయాలంటే నియమాలేంటంటే..

శివ లింగానికి ఎలా పడితే అలా అభిషేకం నిర్వహించకూడదు. దక్షిణం, తూర్పు వైపు నిల్చుని జలాభిషేకం చేయరాదు. శివలింగానికి ఉత్తర ముఖంగా అభిషేకం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కూర్చున్న స్థితిలోనే శివలింగానికి అభిషేకం నిర్వహించాలట. ఇక నీటిని రాగి పాత్రలతో తీసుకుని మాత్రమే శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఉక్కు లేదా ఇనుప పాత్రలతో శివలింగానికి అభిషేకం చేయకూడదు. అయితే నీటితో కాకుండా పాలతో అభిషేకం చేస్తే ఈ నియమాలు వర్తించవట. అలాగే శంఖంలో నీరు పోసి శివలింగానికి అభిషేకం చేయకూడదు. శంఖుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడని.. అతని ఎముకలతోనే శంఖం తయారైందని చెబుతారు. కాబట్టి శంఖంతో శివుడిని అభిషేకించకూడదట. పరమేశ్వరుడికి పాలాభిషేకం వరకూ సాధారణ పాత్రతో అయినా అభిషేకం చేయవచ్చు.

Share this post with your friends