దుర్గా నవరాత్రుల సమయంలో మనం అమ్మవారి తొమ్మిది రూపాలను నవ దుర్గలుగా పూజిస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు దుర్గా సప్తశతి, దుర్గా చాలీసాను పారాయణం చేస్తారు. దుర్గా చాలీసాను పఠించే సమయంలో కొన్ని నియమాలైతే తప్పక పాటించాలి. దుర్గా చాలీసా పఠించడానికి సూర్యోదయానికి బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం అమ్మవారిని పీఠంపై ప్రతిష్టించాలి. అమ్మవారికి పువ్వులు, పసుపు, కుంకుమ, నైవేద్యాలను సమర్పించాలి.
అనంతరం అమ్మవారి వద్ద దీపం వెలిగించి దుర్గా చాలీసాను పఠించాలి. ఆపై అమ్మవారికి హారతి ఇచ్చి ప్రసాదం తీసుకోవాలి. దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శత్రువులపై విజయం సాధించడంతో పాటు మనకు శత్రు ప్రభావం అనేది తగ్గుతుంది. దుర్గా చాలీసాను పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు సైతం చేకూరుతాయని చెబుతారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందట.