మాఘపూర్ణిమ రోజు పాటించాల్సిన విధివిధానాలేంటంటే..

మాఘ పూర్ణిమ ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా. ఈ నెల 12న మనం మాఘ పౌర్ణమి జరుపుకోనున్నాం. ఇక ఈ రోజున పాటించాల్సిన విధి విధానాలేంటో తెలుసుకుందాం. శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం.. లేదంటే నదీ స్నానం చేయడం చాలా మంచిది. అయితే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం చేసే సమయంలో ఒక కరక్కాయను నీటిలో వేయాట. అలా చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయట. పౌర్ణమి రోజు సముద్ర, నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలట. ఒకటింపావు కేజీ నల్ల నువ్వులను ఏదైనా ఆలయంలో అర్చకులకు దానమివ్వాలి. మాఘ పౌర్ణమి పార్వతీ మాతకు ఇష్టమైన రోజట.

మాఘ పౌర్ణమి నాడు ఏదైనా ఇబ్బంది పడుతున్న ఆడవాళ్లు పార్వతీదేవిని పూజిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. తమలపాకులో పసుపు ముద్దతో గౌరమ్మను చేసి గంధం, కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి. ఆపై అక్షితలతో గౌరమ్మను పూజించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే దాంపత్య సమస్యలు తొలగిపోతాయట. అలాగే గౌరీదేవిని స్మరిస్తూ గోరింటాకు దానమివ్వాలి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు త్వరగా పెళ్లి జరుగుతుందట. అలాగే మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలున్న ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కరించి పసుపు రంగు వస్త్రాన్ని ఉంచాలట. అలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్యం మూలలో పీట పెట్టి దానిపై బియ్యప్పిండి ముగ్గు వేసి దానిపై ప్రమిద పెట్టి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే జాతకంలో గురు దోషం ఉంటే తొలగిపోతుందట.

Share this post with your friends