ఈ అక్షయ తృతీయ నాడు మూడు యోగాలు ఏర్పడనున్నాయని తెలుసుకున్నాం కదా. మూడు మంచిని కలిగించేవే. సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, రవి యోగం ఇవి మూడు కలిసి ఈసారి అక్షయ తృతీయను మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించుకుంటాం. లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని సైతం పూజిస్తే ఆర్థికంగా చాలా బాగుంటుందట. కుబేరుడు సంపదకు అధిపతి కాబట్టి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడట.
అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో నీరు నింపి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా జీవితంలో సానుకూల శక్తి నిలిచి ఉండటంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి సైతం ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద, డబ్బుల లాకర్, పూజ గది, వంట గది, తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట. ఇక ఈరోజున దానం చేస్తే కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. స్తోమతను బట్టి బంగారం, బెల్లం, బియ్యం, నెయ్యి, నీరు, వస్త్రదానం వంటివి చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా శ్రేయస్సు చేకూరుతుంది.